
KTR Slams Congress
ది డిజిటల్ బ్రీఫ్
హైదరాబాద్, మే 25, 2026:
K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య పనిచేసే నాయకులకే భవిష్యత్తులో టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. విద్యుత్ మీటర్లు, ఇందిరమ్మ ఇళ్లు, హైడ్రా కూల్చివేతలు, రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఓటర్ లిస్ట్ సవరణ వంటి అనేక అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
“నాయకుల చుట్టూ తిరిగేవాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకే టికెట్లు ఇస్తాం” అంటూ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన కేటీఆర్.. విద్యుత్ మీటర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
“ట్రాన్స్‌ఫార్మర్‌లకు, మోటార్లకు మీటర్లు పెడతారు అంటున్నారు. ఆనాడు మోదీ ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసుల భయంతో మోదీ తానా అంటే తందాన అంటున్నాడు” అంటూ విమర్శించారు.
“ఈ కాంగ్రెస్ ఫ్యూజులు పీకాల్సిందే” అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. రైతుల ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ ఎప్పుడూ రాజీ పడలేదన్నారు.
“ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపిస్తే రాజకీయ సన్యాసం”
హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటాను” అని సవాల్ విసిరారు.
పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
“ఇందిరమ్మ రాజ్యమంటూ గద్దెనెక్కి పేదల ఇండ్లను కూలుస్తూ వారి బతుకులను రోడ్డున పడేస్తున్నారు” అని మండిపడ్డారు.
హైదరాబాద్‌కు 24 గంటల తాగునీరు
హైదరాబాద్ నగరానికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
“మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. అధికారంలోకి రాగానే 24 గంటలు విద్యుత్ ఇచ్చినట్టే.. 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తాం” అని ప్రకటించారు.
“65 ఏండ్లు కాంగ్రెస్ వాళ్లు కరెంటు ఇవ్వలేదు. శివారు ప్రాంతాల్లో పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ వచ్చాకే పరిస్థితులు మారాయి” అని పేర్కొన్నారు.
అదేవిధంగా పేదలకు ఇండ్ల పట్టాల విషయంలో కూడా కేసీఆర్ సేవలను గుర్తుచేశారు.
“హైదరాబాద్‌లో రెండున్నర లక్షల మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన మనసున్న నాయకుడు కేసీఆర్” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైడ్రాపై తీవ్ర విమర్శలు
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలపై కూడా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఆదివారం వస్తే హైడ్రాతో అరాచకం చేస్తున్నారు. ఇండ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యం పని అయిపోయింది” అంటూ విమర్శించారు.
కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ భయంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
“ఇల్లు కూలిపోతుందనే భయంతో మహిళ ప్రాణాలు తీసుకుంది. వేలాది ఇండ్లను దుర్మార్గంగా కూలగొడుతున్నారు” అని ఆరోపించారు.
ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా పేదల ఇండ్లపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
“ఇది చెత్త ప్రభుత్వం” అంటూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రియల్ ఎస్టేట్ కుప్పకూలింది
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితిపై కూడా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ దద్దమ్మల పాలనలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది” అని విమర్శించారు.
లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, సెంట్రింగ్ కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు.
“మీరు అధైర్యపడొద్దు. 2028లో మళ్లీ రాబోయేది కేసీఆర్.. గులాబీ జెండానే” అంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
బీమాతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఓటర్ లిస్టులపై అప్రమత్తంగా ఉండాలి
ఈసీ చేపడుతున్న SIR ప్రక్రియ, ఓటర్ లిస్ట్ సవరణలపై కూడా కేటీఆర్ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
“కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి” అని సూచించారు.
రాష్ట్రంలో 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని, మొత్తం 35,985 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని తెలిపారు.
“జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుంది. ప్రతి బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి” అని పేర్కొన్నారు.
బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేయాలని కోరారు.
“బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు తొలగించారు”
ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు.
“బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు పోయాయి. బిహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు” అని పేర్కొన్నారు.
తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
“మీ బూత్‌కు మీరు ఎమ్మెల్యే లెక్క” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
జూబ్లీహిల్స్‌లో డూప్లికేట్ ఓట్లు?
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు.
“జూబ్లీహిల్స్‌లో డూప్లికేట్ ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచింది” అని ఆరోపించారు.
ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల నకిలీ ఓట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
“నకిలీ ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు సాగవు. బీఆర్ఎస్ సునాయాసంగా గెలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, హ్యాండ్‌బుక్స్, వర్క్‌బుక్స్ అందిస్తామని తెలిపారు.
2028 లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ 2028 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ క్యాడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయడం, బూత్ స్థాయిలో బలోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేయడం వంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Also read the Iran Tensions 2026: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు?.. 72 గంటల్లో జరిగిన పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్
for more info visit PIB, Election commission



