BRS Digital Membership Drive: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో

BRS Digital Membership Drive
BRS Digital Membership Drive

ఆరు గంటలపాటు సాగిన కీలక సమావేశం.. రాష్ట్రవ్యాప్తంగా 71 వేల మందికి డిజిటల్ మెంబర్‌షిప్ శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలు

BRS Digital Membership Drive

ది డిజిటల్ బ్రీఫ్ 

హైదరాబాద్, మే 13, 2026:

K. Chandrashekar Rao అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశం దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్, ఎన్నికల వ్యూహాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో పెరుగుతున్న డిజిటల్ విధానాలను ప్రస్తావించిన కేసీఆర్.. Election Commission of India చేపడుతున్న SIR ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు మొత్తం డిజిటల్ విధానంలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే ప్రతి మండలం, మున్సిపల్ బాడీ స్థాయిలో సభ్యత్వ సమన్వయ కమిటీలను రెండు నుంచి మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు డిజిటల్ మెంబర్‌షిప్ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలను నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ఇంచార్జీలను కూడా ఖరారు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తక్కళ్లపల్లి రవీందర్ రావు, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు సత్యవతి రాథోడ్‌ను నియమించారు.

జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు గ్యాదరి బాలమల్లు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు గంగాధర్ గౌడ్ బాధ్యతలు అప్పగించారు.

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు నారదాసు లక్ష్మణ్ రావు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సబితా ఇంద్రారెడ్డి నియమితులయ్యారు.

అలాగే మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు మహమూద్ అలీ, గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు మెట్టు శ్రీనివాస్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాలకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు తలసాని శ్రీనివాస్ యాదవ్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను సభ్యత్వ నమోదు ఇంచార్జీలుగా నియమించారు.

బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే ఈ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ పార్టీని పూర్తిస్థాయిలో యాక్టివ్ మోడ్‌లోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *