సిద్ధిపేటలో వ్యాపారవేత్త హత్య కేసులో కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్

సిద్ధిపేటలో వ్యాపారవేత్త హత్య కేసులో కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్
సిద్ధిపేటలో వ్యాపారవేత్త హత్య కేసులో కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.60 లక్షలు పోగొట్టుకున్న కానిస్టేబుల్ ప్రవీణ్.. అప్పు అడిగిన వ్యాపారవేత్తను హత్య చేసి బంగారం దోచుకున్న దంపతులు

ది డిజిటల్ బ్రీఫ్
హైదరాబాద్, మే 7, 2026:

సిద్ధిపేటలో వ్యాపారవేత్త హత్య కేసులో కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను హంతకుడిగా మార్చింది. సిద్ధిపేట సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ గౌటి ప్రవీణ్, అతని భార్య రజిత కలిసి స్థానిక వ్యాపారవేత్త బెల్దె విశ్వనాధం(57)ను పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణ హత్య వెనక ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులే కారణమని పోలీసులు గుర్తించారు.

చిన్నకోడూరుకు చెందిన ప్రవీణ్ గత రెండేళ్లుగా భార్యతో కలిసి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అడిక్ట్ అయ్యాడు. రెండేళ్లలో రూ.60 లక్షలు నష్టపోయారు. అప్పులు తీర్చేందుకు సిద్ధిపేట వ్యాపారవేత్త విశ్వనాధం వద్ద స్థలం తాకట్టు పెట్టి రూ.12 లక్షలు తెచ్చాడు. ఆ డబ్బు కూడా బెట్టింగ్‌లో పోయింది. అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో తాకట్టు స్థలం అమ్మేస్తానని విశ్వనాధం హెచ్చరించాడు. దీంతో ప్రవీణ్, రజిత దంపతులు హత్యకే పాల్పడాలని నిర్ణయించుకున్నారు.

వేరే స్థలం చూపిస్తామని నమ్మించి విశ్వనాధంను గత శనివారం మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులో అతని కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు నులిమి హత్య చేశారు. 10 తులాల బంగారం లాక్కుని మృతదేహాన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేశారు. అనంతరం హైదరాబాద్ వెళ్లి బంగారం అమ్మేశారు.

భర్త కనిపించడం లేదని విశ్వనాధం భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రవీణ్, రజిత దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా గత నెల 25న తమ ఇంటి వద్ద ఉండే వృద్ధురాలి పుస్తెల తాడు కూడా వీరే దొంగలించినట్లు దర్యాప్తులో తేలింది. దంపతులపై హత్య, దోపిడీ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచిన పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *